New Muslims APP

గోరంతటి కర్మకు కొండంతటి పుణ్యం

గోరంతటి కర్మకు కొండంతటి పుణ్యం

”అల్లాహ్‌ ఎవ్వరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతే కాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు”. (అన్నిసా: 40)

పాళీ బాషలో ఓ నీతి ఉంది:
”ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి”.
పాపకర్ముడు ఇహపరాలు రెండింలోనూ దుఃఖిస్తాడు.
”ఇథ మోదతి, పెచ్చ మోదతి, కృతపుజ్ఞ ఉభయత్థ మోదతి”
పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింలోనూ సుఖిస్తాడు.

కాబట్టి సత్కర్మ అది ఎంత చిన్నదయినా దాన్ని చులకనగా భావించ కూడదు. దుష్కర్మ ఎంత అల్పమయినదయినా దాని విషయంలో అజాగ్రత్త తగదు. ప్రవక్త (స) ఇలా అన్నారు:”మంచికి సంబంధించిన ఏ పనినీ న్వువ్వు అల్పమయినదిగా భావించకు. నువ్వు నీ సోదరునితో నగుమోముతో కలవడం అయినా సరే”. (తిర్మిజీ) మనం చేసే గోరంతి కర్మకు కొండంతి పుణ్యం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం!

”ప్రతి ఫర్జ్‌ నమాజు తర్వాత ఎవరయితే’ఆయతుల్‌ కుర్సీ’ పఠిస్తారో – వారిని స్వర్గ ప్రవేశం నుండి మరణం తప్ప ఏదీ ఆప జాలదు” అన్నారు ప్రవక్త (స). (నసాయీ)

స్మరణకు సంబంధించిన గోరంతటి కర్మ:

”మీరు చేసే కర్మల్లో ఉత్కృష్ట కర్మను గురించి, మీ ప్రభువు దగ్గర మిక్కిలి ప్రియమయిన కర్మను గురించి, మీ స్వర్గ అంతస్తులను అమాంతంగా పెంచే అత్యుత్తమ కర్మను గురించి, వెండి బంగారాలు దానం చెయ్యడం కన్నా మేలయిన కర్మను గురించి, మీరు మీ శత్రువులతో తలపడి ఒండొకరి మెడలు నరుక్కోవడం కన్నా ఉత్తమమయిన కర్మను గురించి నేను మీకు తెలుపనా? అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) తన సహచరుల్ని అడగ్గా – ‘తప్పకుండా ఓ దైవప్రవక్తా!’ అన్నారు వారు. అప్పుడాయన (స) ఇలా అన్నారు: ”ఆ మహిమాన్విత కర్మయే అల్లాహ్‌ స్మరణం”. (ముస్నద్‌ అహ్మద్‌, తిర్మిజీ, హాకిమ్‌)

ఆ స్మరణ-జిక్ర్‌ వివరాలు సంక్షిప్తంగా తెలుసకుందాం!

ఎవరయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్‌ ముల్కు వలహుల్‌ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌’ అని రోజు ప్రారంభ వేళలో అంటారో,అతనికి పది మంది బానిసల్ని విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అతని ఖాతాలో 100 పుణ్యాలు వ్రాయ బడతాయి. అతని కర్మల చిట్టా నుండి 100 పాపాలు తొలగించ బడతాయి. ఆ పగలంతా సాయంత్రం ఆయ్యేంత వరకూ అతన్ని షైతాను నుండి కాపాడటం జరుగుతుంది. అతను చేసిన ఆ కర్మకు మించిన కర్మ మరొకటి లేదు; అలాంటి కర్మను, లేదా దానికి మించిన కర్మను అతను చేస్తే తప్ప” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (బుఖారీ, ముస్లిం)

”రెండే రెండు పదాలు. నాలుకపై చాలా తేలికయినవి. త్రాసులో చాలా బరువయినవి. రహ్మాన్‌ -కరుణామయునికి చాలా ప్రియమయినవి – సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహిల్‌ అజీమ్‌” అన్నారు ప్రవక్త (స).(ముత్తఫఖున్‌ అలైహి)
”స్వర్గ నిధులలోని ఓ నిధిని గురించి నేను మీకు తెలుపనా? ఆ మహా నిధే – లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌” అన్నారు ప్రవక్త (స). (ముత్తఫఖున్‌ అలైహి)

పారాయణానికి సంబంధించిన గొరంతి కర్మ:

”ఒక రాత్రిలో మూడో వంతు ఖుర్‌ఆన్‌ చదవడం మీకు కష్టమా?” అని ప్రశ్నించారు ప్రవక్త (స). ‘మూడో వంతు ఖుర్‌ఆన్‌ ఒక రాత్రి ఎలా సాధ్యం?’ అని తిరిగి ప్రశ్నిచారు సహచరులు. అందుకు – ”ఖుల్‌ హువల్లాహు అహద్‌” (సూరహ్‌ ఇఖ్లాస్‌) మూడోవంతు ఖుర్‌ఆన్‌కు సమానం అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
”సూరతుల్‌ కహఫ్‌లోని ప్రారంభ పది ఆయతులు కంఠస్థం చేసుకున్న వ్యక్తి దజ్జాల్‌ ఉపద్రవం నుండి కాపాడ బడతాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
”ప్రతి ఫర్జ్‌ నమాజు తర్వాత ఎవరయితే’ఆయతుల్‌ కుర్సీ’ పఠిస్తారో – వారిని స్వర్గ ప్రవేశం నుండి మరణం తప్ప ఏదీ ఆప జాలదు” అన్నారు ప్రవక్త (స). (నసాయీ)

దరూద్‌కు సంబంధించిన గోరంతటి కర్మ:

”ఎవరయితే నా మీద ఒక్క సారి దరూద్‌ పంపిస్తారో అల్లాహ్‌ వారి పది పాపాలను మన్నిస్తాడు. పది పుణ్యాలు ఇస్తాడు. (స్వర్గపు) పది అంతస్తులను పెంచుతాడు” అన్నారు ప్రవక్త (స). (అహ్మద్‌)

ఇస్తిగ్ఫార్‌కు సంబంధించిన గోరంతటి కర్మ:

”ఎవరయితే ‘అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్‌తనీ వ అన అబ్దుక వ అన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు, అబూవు లక బి నిఅమతిక అలయ్య వ అబూవు లక బి జన్బీ ఫగ్ఫిర్‌లీ ఫ ఇన్నహు లా యగ్ఫిరుజ్‌ జునూబ ఇల్లా అంత” అని ఉదయం చెప్పి సాయంత్రం లోపు మరణిస్తే. సాయంత్రం చెప్పి ఉదయం లోపు మరణిస్తే అతను స్వర్గవాసుల జాబితాలో చేరతాడు. (బుఖారీ)

నమాజుకు సంబందించిన గోరంతటి కర్మ:

”దివా రాత్రుల్లో ఎవరయితే 12రకాతులు సున్నత్‌ నమాజు చదువుతారో అల్లాహ్‌ వారి కోసం స్వర్గంలో ఓ గృహాన్ని నిర్మిస్తాడు”. (ముస్లిం)

సేవకు సంబందించిన గోరంతటి కర్మ:

”ఎవరయినా ఉదయం వెళ్లి రోగి అయిన తన సోదరుణ్ని పరామర్శిస్తే అతనిపై సాయంత్రం వరకూ 70 వేల మంది దైవదూతలు దీవెనలు కురిపిస్తూనే ఉంటారు”. (తిర్మిజీ)

ప్రవర్తనకు సంబందించిన గోరంతటితి కర్మ:

”తల్లిదండ్రుల మధ్య పడుకొని వారిరువురిని నవ్విస్తున్నంత సేపు ఆ కుమారుడు స్వర్గం నడి బొడ్డున ఓలలాడుతుంటాడు”.
”దారిన పడి ఉన్న కొమ్మను తొలగించిన కారణంగా ఓ దాసుడు స్వర్గం నడి బొడ్డున పొర్లుతున్నాడు”. (ముస్లిం)
ఇలాంటి మరెన్నో గోరంతటి కర్మల్ని తెలుసుకొని కొండంతటి పుణ్యాలను మీ సొంతం చేసుకుంటారని ఆశిస్తూ…!

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply