New Muslims APP

శాంతి భద్రతకు దశ సూత్రాలు 1

ప్రపంచ శాంతి-భద్రతలను తీసుకొని ఈ రోజు ఎన్నో సభలు, సమా వేశాలు ఏర్పాటు చేయ బడుతున్నాయి. ఎన్నో పుస్తకాలు వ్రాయ బడుతున్నాయి, ఎందరో పండిత మహాశయులు తమ విలువయిన సూచనలను అందజేస్తూ ఉన్నారు. అయినా, తృప్తి లేక, శాంతి కరువయి మనసులు శిలలుగా మారుతుంటే, మనుషులు మృగాల్లా వ్యవహరిస్తున్నారు. శాంతి దూతలుగా అభివర్ణించుకునే అగ్ర రాజ్యాలే అశాంతి, అలజడులకు ఆజ్యం పోస్తున్నాయి. వీరి దోషపూరిత కుట్రలను నిత్యం నిర్దోషులు బలవుతూనే ఉన్నారు. అయినా ప్రపంచ భద్రతను తమ భుజాలకెక్కించుకున్న వ్యవస్థలు, సంస్థలు సంఘాలు, సమాజాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి.

శాంతి, భద్రత, ప్రశాంతత, తృప్తి అనేవి మానవ సమాజం కాంక్షించే, మానవ నైజం వాంఛించే అవసరాలు. అవి మానవ సమాజ మనుగడకు ఔషధం లాంటివి.

దీనికి గొప్ప ఉదాహరణ – 2013 నుండి సీరియా, ఇరాక్‌, యమన్‌ వంటి దేశాలలో కొనసాగుతున్న మారణకాండే. మనిషికి శాంతి, భద్రతలు కరువయింది తెలిస్తే మనిషి తను నివసించే జన వాసాన్ని వదలి వనంలో నివాసం ఏర్ప రచుకోవడానికి వెనుకాడడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పండితుడు మొదలు పామరుని వరకూ, ధనికుడు మొదలు కడు పేద వరకూ, ఆస్తికులు మొదలు నాస్తికుల వరకూ అందరూ కోరుకునే సమైక్య వస్తువు – శాంతి-భద్రత.
శాంతి, భద్రత, ప్రశాంతత, తృప్తి అనేవి మానవ సమాజం కాంక్షించే, మానవ నైజం వాంఛించే అవసరాలు. అవి మానవ సమాజ మనుగడకు ఔషధం లాంటివి. ఆత్మ శాంతి, సంతృప్తి మనిషిని అల్లాహ్‌ ప్రేమకు పాత్రుణ్ణి చేసి, స్వర్గ శిఖర భాగమయిన జన్నతుల్‌ ఫిర్‌దౌసిల్‌ ఆలాలో వసింపజేస్తే, దేహ, దేశ శాంతి, భద్రతలనేవి మనిషిని ప్రగతి బాటన పయనింపజేసి, కీర్తి శిఖరాల మీద కూర్చో బెడతాయి. తృప్తి, శాంతి, భద్రత అనేవి మనిషిలో అసంతృప్తిని, ఆందోళనను, అభద్రతను, అసహనాన్ని దూరం చేస్తాయి. అల్లాహ్‌ నామాల్లోని ఒక నామం ‘మోమిన్‌’ భద్రత దాత కాగా, మరో నామం ‘సలామ్‌’ శాంతి ప్రదాత.

శాంతి-భద్రతలు ఎలా లభిస్తాయి?

పిల్లాడికి భద్రత ఎక్కడ? శాంతి ఎక్కడ? అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం తల్లి ఒడి అని. అదే లోక రక్షణ, ప్రజా భద్రత, విశ్వ శాంతి ఎక్కడ? అని అడిగితే ఒక్కోక్కరు ఒక్కో విధంగా సమాధానమిస్తారు; ఎందుకు? పై యదార్థంలానే క్రింది విషయంలోని యదార్థాన్ని ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు? లోక రక్షణ, ప్రజా భద్రత, విశ్వ శాంతి అనేవి లోక పాలకుడు, ప్రజలందరి ప్రభువు, ఆరాధ్యుడు, విశ్వకర్త సన్నిధికి చేరినప్పుడే, ఆయన ఆదేశాలనుగుణంగా జీవించినప్పుడే సాధ్యం అని ఎందుకు గ్రహించడం లేదు? మనందరి నిజ ఆరాధ్యుడు, విశ్వకర్త, విశ్వ శాంతి-భద్రత కోసం తెలియజేసిన ఓ పది సూత్రాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము.

మొదటి సూత్రం: స్వచ్ఛమైన విశ్వాసం – ఈమాన్‌.

విశ్వ శాంతి, భద్రతకు అసలు పునాది స్వచ్ఛమయిన తౌహీద్‌. నిజ ఆరాధ్యుడి యెడల సత్య బద్ధమయిన విశ్వాసం. ఇది లేకుండా విశ్వ శాంతి, భద్రత ఎవరు ఎన్ని విధాల ప్రయత్నించినా, ఆ ప్రయత్నించే వారు ఆస్తికులయినా, నాస్తికులయినా, పండితులయినా, పామరుల యినా, కుటీశ్వరులయినా, కూటికి లేనివారయినా అసాధ్యం, అసంభవం.

భాషా పరంగా ఈమాన్‌, ‘అమన్‌’ మూల ధాతువు నుండి వచ్చిన పదం. దీనర్థం – భద్రత, ఇది భయానికి వ్యతిరేకం. ఆ రకంగా ఈమాన్‌ అంటేె, ఒక భద్రత, ఒక ప్రశాంతత, ఒక నమ్మకం. ఇస్లాం అంటే ఒక విధేయత, ఒక సమర్పణ. ప్రజలందరి నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ యెడల మనిషి ఏ స్థాయి విశ్వాసం కలిగి ఉంటాడో, ఏ స్థాయి విధేయత కనబరుస్తాడో ఆ స్థాయి శాంతి, ఆ స్థాయి భద్రత అతనికి దక్కుతుంది. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”సో, ఎవరు విశ్వసించి, తమ ప్రవర్తను సంస్కరించుకుాండో వారికెలాంటి భయం గానీ దుఃఖం గానీ ఉండదు”. (అల్‌ అన్‌ఆమ్‌: 48)

భయం, ఖేదం, దుఃఖం, ఆందోళన అంతమయితే లభించేదే సంపూర్ణ భద్రత, శాంతి,. సౌభాగ్యం, శాశ్వత విజయం. విశ్వాసం మరియి భద్రత, శాంతి అనేవి పరస్పరం అవిభాజ్యాలు. దీన్ని పొందనిదే దాన్ని పొంద లేము, దీన్ని దక్కించుకోనిదే దాన్ని దక్కించుకో లేము. కాబట్టి మనిషి నిజ ఆరాధ్యుని యెడల స్వచ్ఛమయిన తౌహీద్‌ భావన కలిగి ఉండటంతోపాటు షిర్క్‌, బహుదైవ భావాల నుండి తన్ను తాను కాపాడుకోవాలి. ఎందుకంటే, ఎలాగయితే స్వచ్ఛమయిన తౌహీద్‌ విశ్వాసం భద్రకు, శాంతికి మూల కారణమో, ఆలాగే షిర్క్‌ అశాంతికి, అభద్రతా భావానికి, ఆలజడికి అసలు మూలం. అల్లాహ్‌ ఇలా విశద పరుస్తున్నాడు: ”విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగాపులగం చేయకుండా ఉండేవారి కోసమే భద్రత, రక్షణ ఉంది. మరియు సన్మార్గంపై ఉన్న వారు కూడా వారే”. (అల్‌ అన్‌ఆమ్‌: 82)

అనగా, నిజ ఆరాధ్యుడిని విశ్వసించాల్సిన రీతిలో విశ్వసించకుండా, విశ్వసించినా, విధేయత చూపాల్సిన స్థాయిలో విధేయత చూపకకుండా, మిథ్యా దైవాలను విడనాడకుండా, ఎన్ని సంఘాలు, ఎన్ని సమితులు, ఎన్ని సమాజాలు ఏర్పడి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రపంచ శాంతి అందని ద్రాక్షగానే ఉంటుంది. ప్రజా భద్రత అంతంత మాత్రమే ఉంటుంది. దీనికి సుదీర్ఘ మానవ చరిత్రే సాక్షి!

చూడండి! నెలవంకను చూసినప్పుడు చేసే దుఆలో ప్రవక్త (స) విశ్వాసం మరియు భద్రతను, విధేయత మరియు శాంతిని ఎలా ఒకే చోట ప్రస్తావించారో. ”అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్‌ యుమ్‌నీ వల్‌ ఈమాని” – ఓ అల్లాహ్‌! దీనిని మాపై భద్రత మరియు విశ్వాసం – ఈమాన్‌ కలదిగా ఉదయింపజెయ్యి. ”వస్సలామతి వల్‌ ఇస్లాం” ఇస్లాం – ఫూర్ణ విధేయత మరియు శాంతితో. ”రబ్బీ వ రబ్బుకల్లాహ్‌” (ఓ చద్రమా!) నీ ప్రభువు నా ప్రభువు అల్లాహ్‌యే. (తిర్మిజీ)

అనగా భద్రత ఈమాన్‌ అవిభాజ్యాంశం అయితే, శాంతి ఇస్లాం అవిభాజ్యాంశం. ఎవరయితే శాంతి భద్రతలను కాంక్షిస్తారో వారు ఈమాన్‌ మరియు ఇస్లాంను అనుసరించడం వినా మార్గాంతరం లేదు. ప్రవక్త (స) వారి మరో వచనాన్ని గమనించండి! ”అల్‌ ముస్లిము మన్‌ సలిమల్‌ ముస్లిమూన మిన్‌ లిసానిహి వ యదిహి” తన నోటితోగానీ, తన చేతితోగానీ శాంతికాముకులు – ముస్లిములకు ఎలాంటి హాని తల పెట్టనివాడే ముస్లిం. ”వల్‌ మోమిను మన్‌ అమనహున్నాసు అలా దిమాయిహిమ్‌ వ అమ్‌వాలిహిమ్‌” ఎవరినయితే ప్రజలు తన ధన, ప్రాణాలకు భద్రతనిచ్చేవానిగా, సంరక్షకునిగా భావిస్తారో అతనే మోమిన్‌. (తిర్మిజీ)
ఒక ముస్లిం నోటి ద్వారా, చేతి ద్వారా ప్రజలు అశాంతికి, అలజడికి గురువుతున్నారంటే, అతని ఇస్లాంలో లోపం ఉంది. ఒక మోమిన్‌ను ప్రజలు తమ ధన ప్రాణాలకు భద్రతనిచ్చేవానిగా భావించడం లేదంటే, అది అతని విశ్వాసం-ఈమాన్‌లో లోపం వల్లనే. అల్లాహ్‌తో ఉండాల్సిన అనుబంధం సడలింది అని అర్థం. పూర్ణ భద్రత, ఫూర్ణ శాంతి మనిషికి కావాలంటే తను తన ఇస్లాం మరియు ఈమాన్‌ను ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హథీసులకనుగుణంగా పూర్తి చేసుకున్నప్పుడే సాధ్యం.ఈ ప్రాతిపదికన పండితులు ప్రజలల్ని మూడు శ్రేణుల క్రింద విభజించారు.

మొధటి శ్రేణి: పూర్ణ విశ్వాసం, విధేయత కలిగి ఉన్న వారు. వారికి పూర్ణ శాంతి, భద్రత ప్రాప్తమవుతుంది.
రెండవ శ్రేణి: అసలు విశ్వాసం, విధేయత లేని వారు. వారికి శాంతి, భద్రత లభించదు.
మూడవ శ్రేణి: స్థాయిని బట్టి శాంతి భద్రత. ఇది మనిషి విశ్వాస స్థాయిని బట్టి , ధర్మ స్థాయిని బట్టి ఉంటుంది. ధర్మ స్థాయి అంటే, ఇస్లాం, ఈమాన్‌, ఇహ్సాన్‌.
రెండవ సూత్రం: ధర్మాన్ని అల్లాహ్‌ కోసం ప్రత్యేకించడం, ఆరాధన కోసం సదా సిద్ధంగా ఉండటం.

మనం మన నమాజును, మన సకల ఉపాసనా రీతులను, మన జీవితాన్ని, మన మరణాన్ని సమస్త లోకాలకు ప్రభువయిన అల్లాహ్‌ కోసం మాత్రమే అంకితం చెయ్యాలి. మనం మన ఆరాధనలను సంరక్షించుకోవాలి. ఆయన వారించిన సకల విషయాల నుండి మనం దూరంగా ఉండాలి. ఆయన అనమన్నదే అనాలి, అయన కనమన్నదే కనాలి. ఆయన చెయ్యమన్నదే చెయ్యాలి. ఆయన నడవమన్న బాటనే నడవాలి. ఇలా గనక మనం చేసామంటే, ఆయన మనం చూసే కన్నయి పోతాడు, మన పట్టుకునే చేయినయిపోతాడు. మనం వినే చెవినయి పోతాడు. మనం నడిచే పాదమయి పోతాడు. మనకు కావాల్సిన శాంతి, భద్రతలు మన సొంతం అవుతాయి. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా ఉపదేశిస్తున్నాడు: ”మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్టుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిథ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళల స్థానే శాంతి భద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. (ప్రతిగా) వారు నన్ను మాత్రమే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరిని కల్పిం చరు”. (అన్నూర్‌: 55)

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”విపత్కర సమయంలోని ఆరాధన నా వైపునకు హిజ్రత్‌ చెయ్యడంతో సమానం”. (ముస్లిం)
ఆపద సమయంలో, విపత్కర పరిస్థితిలో మనిషి ఆరాధనలకు దూరం అవుతాడు. అతనికున్న భయం, ఆందోళన, చుట్టు ప్రక్కల పరిస్థితులు అతన్ని అలా వ్యవహరించేలా చేస్తాయి. దాడుల గురించి, మరణాల గురించి, ప్రభుత్వాల గురించి మాటా మంతితో కాలక్షేపం చెయ్యడానికి ఇష్ట పడతాడు. కాబట్టి పరిస్థితి మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా మనం అల్లాహ్‌ ఆరాధనని విడనాడ కూడదు. ఆయన్ను వేడుకోవడం మానుకోకూడదు. విశ్వాసుల మాత హజ్రత్‌ ఉమ్మె సలమా (ర.అ) కథనం – ఓ రాత్రి ప్రవక్త (స) భయాందోళన స్థితిలో లేచి ఇలా అన్నారు: ”సుబ్హానల్లాహ్‌! ఎన్నెన్ని కరుణా నిధులను అల్లాహ్‌ అవతరింప జేశాడు! ఎన్నెన్ని ఉపద్రవాలను అల్లాహ్‌ దించాడు!! (ఇలాంటి స్థితిలో) గృహస్థులు (ఆయన భార్యలు) నమాజు చదవడాని కి ఎవరు వారిని మేల్కొల్పుతాడు? ఇహలోకంలో సకల సౌకర్యాలతో తులతూగే భాగ్యవంతురాలయిన ఒక స్త్రీ పరలోకంలో పుణ్యం రీత్యా అత్యంత దౌర్భాగ్యురాలిగా ఉండే అవకాశం ఉంది”. (బుఖారీ)

హజ్రత్‌ అలీ (ర) ఇలా అన్నారు: ”పాలకులను విమర్శించిన వాడు తన ప్రపంచాన్ని నాశనం చేసుకుంటాడు. పండితులను తూలనాడిన వాడు తన పరలోకాన్ని నాశనం చేసుకుాండు”. కాబట్టి అన్ని సమ యాల్లో మధ్యేమార్గమే శ్రేయస్కరం. అదేమంటే,
”వారు ఈ (కాబా) గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే ఆకలి గొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు”. (ఖురైష్‌: 3,4)

మూడవ సూత్రం: ప్రార్థన – దుఆ

”ఇహ పరాల్లో సకల మేళ్ళ తలుపులు తెరిచేది దుఆ” అన్నది సజ్జన పూర్వీకుల మాట. సజ్జన పూర్వీకుల్లోని ఒకరు ఇలా అన్నారు: ”మంచి గురించి ఆలోచించాను. దాని ద్వారాలు చాలానే ఉన్నాయి. నమాజు, రోజా, దానం, జ్ఞాన బోధన వగైరా. ఇవన్నీ అల్లాహ్‌ అధీనంలో ఉన్నాయి అన్న యదార్థాన్ని గ్రహించిన మీదట నేను దుఆను ఆశ్రయించాను”. కాబట్టి మనకు ఇహ పరాల్లో మేలు జరగాలన్నా, కీడు నుండి మనం కాపాడ బడాలన్నా, మనం మన కోసం, మన పరివారం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ముస్లిం సముదాయం కోసం రక్షణ, భద్రత, శాంతి, సుస్థిరతలను కోరుకోవాలనుకుంటే వాటన్నింటిని అనుగ్రహించ గలిగే దాతను మనం వేడుకోవాలి. ప్రవక్త (స) ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఈ దుఆ చేస్తూ ఉండేవారు: ”అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుకల్‌ ఆఫియత ఫిద్దున్యా వల్‌ ఆఖిరహ్‌” ఓ అల్లాహ్‌! నేను ఇహపరాల్లో నీ నుండి క్షేమ కుశలతను కోరుకుంటు న్నాను. ”అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక అఫ్వ వల్‌ ఆఫియత పీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ” ఓ అల్లాహ్‌! నేను నీ నుండి నా ప్రాపంచిక వ్యవహారాలలో, నా ధర్మంలో, నా పరివారంలో, నా ధనంలో క్షమను, శ్రేయో సాఫల్యాలను అర్థిస్తున్నాను. ”అల్లాహుమ్మస్‌తుర్‌ ఔరాతీ వ ఆమిన్‌ రౌఆతీ” ఓ అల్లాహ్‌! నా రహస్య తప్పిదాలను కప్పి ఉంచు. నా భయాలను తొలగించు. ”అల్లాహుమ్మహ్‌ ఫజ్‌నీ మిన్‌ బైని యదయ్య వ మిన్‌ ఖల్పీ వ అన్‌ యమీనీ వ అన్‌ షిమాలీ వ మిన్‌ ఫౌఖీ. వ అవూజు బి అజమతిక అన్‌ ఉఘ్‌తాల మిన్‌ తహ్‌తీ” ఓ అల్లాహ్‌! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి, నా ఎడమ వైపు నుండి, నా పై నుండి నన్ను రక్షించు. ఓ అల్లాహ్‌! నీ ఘనత గౌరవాల ఆధారంగా అడుగుతున్నాను – నేను నా క్రింది వైపు నుండి మోసానికి గురవ్వడం నుండి నన్ను కాపాడు”. (అబూ దావూద్‌)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.